వ్ – Part 1

మేఘాల రహదారి మీద రవితేజ సారధిగా ఉన్న శ్వేతాశ్వమ్ముల రధం శర వేగంతో దూసుకుపోతుంది..వెనుక రవితేజ భార్య మధులత, పిల్లలు ఉదయ దీపిక, శశిరేఖ ఉన్నారు.
ఏ వాహనం అడ్డు లేదు, సిగ్నల్స్ లేవు, స్పీడ్ బ్రేకర్స్ లేవు..చుట్టూ ఎంత దూరం వ్యాపించి ఉందో తెలియని ప్రశాంతత..పిల్లల కేరింతలు, మధులత నవ్వు తప్ప అక్కడ మరింకే శబ్దం లేదు..సూర్యుడు తన కాంతులు నిర్విరామంగా ప్రసరిస్తున్నాడు. కింద ఎప్పుడు అల్లకల్లోలంగా ఉండే ప్రపంచం కూడా నిశ్శబ్ధంగా ఉంది .రధం ముందుకి వెళుతుంటే కింద వెనక్కి వెళిపోతున్న ఒక్కో దృశ్యాన్ని పిల్లలకి చూపించి వివరిస్తుంది మధులత..నిమిషానికో ఊరు, అరగంటకో జిల్లా, అలా భారతదేశాన్ని చుడుతున్నారు ..రవితేజ కి కాఫీ అంటే చాలా ఇష్టం ..అందుకే బయలుదేరేప్పుడు ఒక flask నిండా కాఫీ పోసి తీసుకొచ్చింది మధులత…ఒక కప్ లో కాఫీ పోసి ” రవీ ఇదిగో కాఫీ తీసుకో” అని పిలిచింది. వినబడలేదు రవికి. మళ్లీ పిలిచింది..
ఉన్నట్టుండి పెద్ద చప్పుడయ్యింది…ఎందుకో తెలీదు, రధచక్రం శీల విరిగిపోయింది. రధం ఓ పక్కకి ఒరిగిపోతుంది పిల్లలు భయంతో అరవడం మొదలు పెట్టారు. నాన్నా… పడిపోతుంది..కింద పడిపోతాం చచ్చిపోతాం …ఏడుస్తున్నారు…
రవీ..కాఫీ… మళ్లీ పిలిచింది మధులత…
మధులత వైపు కాస్త కోపం, కాస్త ఆశ్చర్యం మిళితమైన చూపు చూసాడు రవి..నెమ్మది నెమ్మదిగా రధం కిందకి పడిపోతుంది… ఏం చెయ్యాలో అర్ధం కాలేదు రవికి..
రవీ….. కాఫీ …
రెండవ చక్రం కూడా ఊడిపోయింది. తను చనిపోతనన్న భయం కన్నా, పిల్లల ఏడుపే భయంకరంగా అనిపించింది రవికి..కాసేపటికి రధం నేలకి గుద్దుకుని ముక్కలుముక్కలైపోయింది….
…………………………..
కళ్ళు తెరిచాడు రవి..ఎదురుగా చిలుకపచ్చ రంగు చీర కట్టుకుని, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని పూర్తిగా తడి ఆరని తలని, తువాలుతో ముడి వేసుకుని చేతిలో కాఫీ కప్ తో నిలబడి ఉంది మధులత..
కొంటెగా నవ్వుతూ…. మళ్లీ కలగన్నావా రవి అంది.
చిన్న నవ్వు నవ్వి లేచి కుర్చుని, వదులయిన లుంగి బిగించి కట్టుకుని, మంచం దిగి కప్ అందుకున్నాడు రవి…
“చెప్పు ఇవాళ ఏం కల కన్నావ్?”
రాత్రి పడుకునే ముందు ఏమన్నావ్ నువ్వు?
“ఏమన్నాను చనిపోయే లోపల ఇండియా అయిన పూర్తిగా చూడాలి అన్నాను.”
ఉ…అదే చేస్తున్నాం కలలో..
నవ్వుకుని అక్కడి నుండి వెళిపోయింది మధులత..
…………………………….
వరండా లోకి వెళ్లి పేపర్ తీసుకుని చదవడం మొదలుపెట్టాడు రవి..ఈ మధ్య కాలంలో తెలుగు దేశం గురించి, బాబు గురించి తప్ప మరేమీ రాయడం లేదని తెలిసినా “ఈనాడు” పేపర్ మాత్రమే వేయించుకుంటాడు రవి..దానికి కారణం కార్టూనిస్ట్ శ్రీధర్.
09/09/2014″
బొత్సకి దొరకని సోనియా దర్శనం”
” స్పీకర్ తల బద్దలు గొట్టిన తెరాస మంత్రి”
“విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం”
కొత్తగా ఏమి లేవు….కాని మెయిన్ పేజి చివర్లో ఎడమ చేతి పక్క కింద కార్నర్ లో ఇచ్చిన ప్రకటన దగ్గర రవితేజ కళ్ళు ఆగాయి…
శ్రద్దాంజలి
కలవచర్ల . సావిత్రి
జననం:03/02/1964 మరణం: 07/09/2014
కూతురు: ప్రణతి MS.pediatrician
అల్లుడు: శ్రీనివాస్ MS.orthopedic
మనవడు: రవితేజ
ఆ ఫోటో లో ఉన్న స్త్రీ వంక కన్నార్పకుండా చూస్తూ అలాగే ఉండిపోయాడు రవితేజ……
………………………………..
09/10/2002
కొయ్యలగూడెం…పశ్చిమ గోదావరి జిల్లా..ఒక మారుమూల పల్లెటూరు…పూర్తిగా పల్లెటూరు అనడానికి కూడా లేదు..ఎందుకంటే చుట్టు పక్కల ఉన్న దాదాపు 200 కుగ్రామాలకి అదే మండలం…మూడు సినిమా theaters ఉన్నాయ్..
హై-వే పక్కన ఉన్న రాంబాబు బడ్డి కొట్లో నుంచుని gold flake filter సిగరెట్ తాగుతున్నారు మోహన్ కృష్ణ, మురళి, రవితేజ…..ముగ్గురు ప్రకాశం డిగ్రీ కాలేజీ లో డిగ్రీ 2nd year చదువుతున్నారు.లంచ్ అవర్ లో భోజనం చేసి రోజూ సిగరెట్ తాగడం అలవాటు….ఆరోజు హోరున వర్షం కురుస్తుంది..మాములుగా కన్నా వర్షం కురుస్తున్నప్పుడు, చలేస్తున్నప్పుడు సిగరెట్ తాగితే ఆ మజాయే వేరు…
ఒరేయ్ ఎన్ని రోజులు రా gold flake filter …ఇంక మనం కింగ్ కి update అవ్వలేమా? అన్నాడు మోహన్ కృష్ణ..
అవ్వొచ్చు దాందేముంది..ఇప్పుడు ఒక్కొక్కళ్ళం ఒక్కోటి కాలుస్తున్నాం…అప్పుడు ముగ్గురం కలిసి ఒక్కటే కాల్చాలి…అయినా కింగ్ కాల్చేవాణ్ణి చూసి బాధపడకండి రా…చార్మినార్ కాల్చేవాణ్ణి చూసి సంతోష పడండి .వాడి కన్నా మనం బెటర్ అన్నాడు రవితేజ…
ఇంతలో మురళి….:”రేయ్ రవి..మొన్న నీకు చెప్పానుగా ఒక కాండిడేట్ గురించి అదిగో అదే….వెళుతుంది చూడు…ఎర్ర గొడుగు…
సగం కాల్చిన సిగరెట్ నేల మీద పారేసి, అటు ఇటు వస్తున్న లారీలను కూడా పట్టించుకోకుండా పరుగెత్తాడు రవి. ఆమె దగ్గరికి వెళ్ళేసరికి తడిసి ముద్దయిపోయాడు..అకస్మాత్తుగా ఎవరో పరుగెత్తుకు వచ్చి పక్కన నిలబడేసరికి ఉలిక్కిపడి తలతిప్పి చూసింది ఆమె. అంత జోరు వానలో తడుస్తూ, రొప్పుతూ, తన పక్కన నిలబడిన కుర్రాణ్ణి చూసి ఒకింత ఆశ్చర్యపోయింది..
______________________________